కాంగ్రెస్ ఏలుబడిలో రైతాంగం కంటతడి – మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 12 : యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత –రుణమాఫీ ఒక నాటకం, రైతు భరోసా ఒక బూటకం–సర్కార్ నిర్లక్ష్యంతో బలిపీఠం పై తెలంగాణ వ్యవసాయం–వరంగల్ రైతు డిక్లరేషన్ కు సమాధి, మళ్ళీ రైతుల ఆత్మహత్యలకు పునాది –కాంగ్రెస్ రాకతో వ్యవసాయానికి చీకటి రోజులు–కేసీఆర్ వస్తేనే మళ్ళీ రైతాంగానికి స్వర్ణ యుగం – బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వ కర్కశ ఏలుబడిలో తెలంగాణ రాష్ట్ర రైతాంగం కంటతడి పెడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.తీవ్రంగా ఉన్న యూరియా కొరత అన్నదాతలకు గుండెకోత మిగిలిస్తోందని ఆయన పేర్కొన్నారు.నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏర్పడిన యూరియా కొరత కారణంగా కలత చెందుతున్న రైతులు దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కి యూరియా ఇవ్వని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను రాసిరంపాన పెట్టే పాపిష్టి పాత రోజులు పునరావతమయ్యాయని రైతులు వాపోతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు. ఎరువుల కోసం చెప్పులు పాసుబుక్ జిరాక్స్ పేపర్లు లైన్ లో పెట్టి పడిగాపులుగాసే పాడు రోజులు మళ్లీ దాపురించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల సాగుచేసిన మొక్కజొన్న వంటి పంటలకు మందు వేసే సమయంలో యూరియా కోసం రైతులు సొసైటీలఎదుట పడికాపులు కాస్తున్నారని ,చెప్పులు పాస్ బుక్ లు, జిరాక్స్ పేపర్లు లైన్లో పెట్టి పొద్దంతా పనులు మానుకొని వేచి ఉంటున్నారని, అయినా వారికి ఒకటి రెండు సంచులకు మించి యూరియా దొరకడం లేదని జీవన్ రెడ్డి పేర్కొంటూ రైతుల దుస్థితి చూసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అరకొర ఎరువుల సరఫరా రైతుల అవసరాలను తీర్చలేక పోతోందని, వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం అన్నదాతలకు శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు.ఒకవైపు ఎరువుల కొరతను నిరసిస్తూ రైతులు రోడ్లు ఎక్కుతుంటే మరోవైపు అసలు కొరతేలేదని యంత్రాంగం చెబుతుండడం సిగ్గుచేటని అయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వరంగల్ రైతు డిక్లరేషన్ ను సమాధి చేసి మళ్ళీ రైతుల ఆత్మహత్యలకు పునాది వేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వెయ్యిమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కనీసం రైతుబీమా సొమ్ము కూడా రాక వారి కుటుంబాల పరిస్తితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.రుణమాఫీ ఒక నాటకమని, నిజామాబాద్ జిల్లాలో ఇంకా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, ఒక్క ఆర్మూర్ నియోజకవర్గంలోనే రుణమాఫీ కాని రైతులు ఇంకా 30 వేల మంది ఉన్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు. రైతు భరోసా ఒక బూటకమని, ఓట్ల కోసం కాంగ్రెస్ సాగిస్తున్న ఒక డ్రామా అని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యంతో తెలంగాణ వ్యవసాయం బలిపీఠమెక్కుతోందని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ రాకతో వ్యవసాయానికి చీకటి రోజులొచ్చాయని రైతుల ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ వస్తేనే మళ్ళీ రైతాంగానికి స్వర్ణ యుగం వస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment