జై భారత్ దినపత్రిక వేల్పూర్ మార్చ్ 26 : బాల్కొండ వేల్పూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన BRS మైనారిటీ నాయకులు పాల్గొని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బి ఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకంగా మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ఉపయోగించుకుంటూ వస్తోందని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలు ఇస్తూ, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోందని అన్నారు.మైనారిటీల సంక్షేమానికి ప్రతి సంవత్సరం ₹4,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, మూడు బడ్జెట్లలో కలిపి సుమారు ₹10,400 కోట్లు కేటాయించామని చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవంగా కనీసం ₹2,000 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోయిందని విమర్శించారు. 2024-25 సంవత్సరంలో ₹2,150.78 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా, కేవలం ₹793.79 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం (37%) మైనారిటీలపై నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.మైనారిటీ కుటుంబాలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న షాదీ ముబారక్ పథకం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిందని తెలిపారు. బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి మైనారిటీ ఆడబిడ్డకు ₹1,60,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన హామీ అమలు కాలేదని అన్నారు.మైనారిటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ మరియు విదేశీ విద్యా స్కాలర్షిప్లు సకాలంలో అందకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువును మధ్యలోనే నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్‌ను ₹300 కోట్ల నుంచి ₹100 కోట్లకు తగ్గించడం విద్యార్థుల భవిష్యత్తుపై పెద్ద దెబ్బగా అభివర్ణించారు.అబ్దుల్ కలాం తౌఫా-యే-తాలీమ్’ పథకం కింద ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని, పీహెచ్డీ/ఎంఫిల్, పీజీ, ఇంటర్, 10వ తరగతి విద్యార్థులకు ప్రకటించిన ఆర్థిక సహాయం అందలేదని తెలిపారు.మైనారిటీలకు ముఖ్యమైన రంజాన్ తోఫా పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం దురదృష్టకరమని అన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత మరియు మహిళలకు ప్రతి సంవత్సరం ₹1,000 కోట్ల సబ్సిడీ రుణాలు ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వ కాలంలో అమలు చేసిన 80% సబ్సిడీ రుణాలను కూడా దాదాపుగా నిలిపివేశారని ఆరోపించారు.సుమారు ఒకటిన్నర సంవత్సరాల పాటు రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకుండా ఉంచడం తీవ్రమైన అన్యాయమని పేర్కొన్నారు. సిక్కులు, క్రిస్టియన్లకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.ఇమామ్లు, మౌజంల వేతనాల పెంపు హామీ అమలు కాలేదని, వక్స్ బోర్డు ఆస్తుల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వక్స్ ఆస్తుల డిజిటలైజేషన్ పేరుతో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, ఆక్రమణలు కొనసాగుతున్నాయని అన్నారు.ఇల్లు లేని మైనారిటీ కుటుంబాలకు స్థలం తో పాటు ₹5 లక్షలు ఇస్తామని ప్రకటించినా అమలు స్థాయిలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సచార్ కమిటీ, సుధీర్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా పక్కన పెట్టారని తెలిపారు.‘మైనారిటీ డిక్లరేషన్’ పేరిట ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘించిందని, ఓట్ల కోసం ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మర్చిపోయిందని మండిపడ్డారు. ఇది మైనారిటీల నమ్మకానికి చేసిన పెద్ద ద్రోహమని పేర్కొన్నారు.చివరిగా, మైనారిటీలకు కేటాయించిన నిధులను పూర్తిగా వినియోగించడంతో పాటు, ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు.ఈ మీడియా సమావేశంలో ఎం. ఏ మొయిజ్,సయ్యద్ సర్వర్ హుస్సేన్, ఏం.డి అక్రమ్ అబ్దుల్ రజాక్,ఎం. డి తాహెర్,ఎం.డి అజీజ్ (అతీక్) ఎం. డి సూర్జీల్,ఎం. డి ఇక్రమ్,ఎం.డి అహ్మద్ కమ్మర్పల్లి,మహబూబ్,షాహీద్,ఫయాజ్,ఇఫ్తికార్,సల్లవుద్దీన్,మిస్బా,హరున్,బాబా,యూసుఫ్,అజిజ్,యాసిన్,అక్తర్,జైనోద్ధిన్, మునీర్, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలపై అనుసరిస్తున్న విధానాలపై బి ఆర్ ఎస్ నాయకుల తీవ్ర ఆగ్రహం.
Published On: March 26, 2026 6:47 pm











