నిజామాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా ఇవ్వలేదు

అసెంబ్లీ లో ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా

  • పూర్తయి నాలుగేళ్లయిన కేటాయించలేదు.
  • ఇందిరమ్మ ఇళ్లకు స్థలం ఇవ్వాలి.

జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 25 : నిజామాబాద్ అర్బన్ లో గత తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ కూడా అందించలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇవ్వడం లేదని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూంపై మాట్లాడారు. ఇందూరు నాగారం ప్రాంతంలో 396 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి నాలుగున్నర సంవత్సరాలు గడిచిందని గుర్తు చేశారు. బీ ఆర్ ఎస్ నాయకులు కమిషన్ లు తీసుకున్నారు, కానీ ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం దారుణమన్నారు. ఏళ్లుగా వృధాగా ఉండటంతో ఇళ్ల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయని, పలు వస్తువులు చోరీకి గురయ్యాయని చెప్పారు. అనేకసార్లు మంత్రులకు విన్నపించడంతో మరమ్మతుల కోసం 1.25 కోట్లు విడుదల చేశారని, కానీ ఇళ్లు మాత్రం కేటాయించలేదన్నారు. అనవసరంగా ప్రజాధనం వృధా అవుతుందని చెప్పారు. అలాగే కలెక్టరేట్ సమీపంలో 200 డబుల్ బెడ్రూం ఇళ్లు 80 శాతం పూర్తి చేసుకున్నాయని, మరో 2 కోట్లు మంజూరు చేస్తే పూర్తవుతాయన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ దశల్లో ఉన్న మరి కొన్ని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మరో 3 కోట్లు కేటాయిస్తే సుమారుగా వేయి ఇళ్లు పూర్తవుతాయన్నారు.అలాగే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా స్థలంతో పాటు రూ. 5 లక్షలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం ఒకటి కూడా అందించలేదన్నారు. ఇక రెండో సంవత్సరం స్థలం ఉన్నవారికి ఐదు లక్షల అందిస్తామని చెప్పారు. కానీ నిజామాబాద్ అర్బన్ లో స్థలం ఉన్న పేదవారు చాలా తక్కువ మంది ఉంటారని, వారు స్థలం కొనుగోలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. కావున ప్రభుత్వ స్థలం చూయించి, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ళను నిర్మించాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment