కలెక్టర్ ఇలా త్రిపాఠి.
జిల్లా అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వెల్లడి.
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 05: వ్యవసాయ రంగంలో తనదైన ప్రత్యేకతను కలిగి ఉన్న నిజామాబాద్ జిల్లా ఘనతను మరింతగా ఇనుమడింప జేసేలా సాగు రంగానికి ఎనలేని ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశానికి పర్సన్ ఇంచార్జి హోదాలో కలెక్టర్ అధ్యక్షత వహించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు అందిస్తున్న తోడ్పాటు గురించి, వివిధ కార్యక్రమాల అమలు తీరుతెన్నుల గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక సేద్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తూ, అవసరమైన వారికి తగిన తోడ్పాటు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా జిల్లాలో పసుపు పండించే రైతులకు పంట సాగు విషయంలో వెన్నుదన్నుగా నిలుస్తూ, ఆధునిక యంత్ర సామాగ్రిని వినియోగిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. అవసరమైన పక్షంలో మరిన్ని నిల్వలు తెప్పించే బాధ్యత జిల్లా యంత్రాంగానిదేనని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. యూరియా విషయంలో అక్కడక్కడా రైతులలో నెలకొని ఉన్న అపోహలను దూరం చేసేందుకు అభ్యుదయ రైతులు కృషి చేయాలని సూచించారు. మోతాదు మేరకే యూరియా వినియోగించేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. యూరియా ఎరువుల పంపిణీలో అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, దళారుల ప్రమేయం వంటి అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను అందుబాటు లోకి తెచ్చిందని అన్నారు. రైతులు ఈ యాప్ ను వినియోగించుకునేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ జనరల్ మేనేజర్ అనుపమ, సీఈఓ నాగభూషణం, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ సునీల్, ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య, సహకార తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.












