మద్నూరు జై భారత్ ఆగస్టు 16 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మద్నూర్ మండల పరిధిలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో మండలంలోని పలు గ్రామాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ముఖ్యంగా చిన్న ఎక్లార గ్రామం వద్ద వాగులోకి భారీగా వచ్చిన వరదనీరు గ్రామంలోకి చేరి ప్రజలకు భయాందోళన కలిగిస్తోంది.గ్రామంలో ప్రధాన ఆలయం, తాగునీటి ట్యాంక్ సమీపం నుంచి ప్రవహించిన వరదనీరు గల్లీల్లోకి చేరడంతో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై నిల్వ నీరు చేరడంతో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని పలు ఇళ్ల చుట్టూ మురుగు నీరు చేరడంతో దుర్వాసన వ్యాపించే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పంట పొలాల్లో కూడా వరద నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. రాకపోకలు పూర్తిగా దెబ్బతినడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారు. అత్యవసర అవసరాల కోసం వెళ్లాల్సిన వారు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరదనీటి దారులను క్రమబద్ధీకరించి, రోడ్లను బలోపేతం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.చిన్న ఎక్లారలో ప్రస్తుతం గ్రామం నీటమునిగి ఉండటంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు.భారీ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగితే పరిస్థితి మరింత విషమించవచ్చని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చిన్న ఎక్లార గ్రామం జలమయం.. ఆందోళనలో ప్రజలు..
Published On: August 16, 2025 9:41 pm











