ఎనిమిదవ రోజు ఉదయం యాగం, మహా పూర్ణాహుతి, స్వామి వారి రథోత్సవం శ్రీ చక్రస్నానం.
సాయంత్రం శ్రీ పుష్ప యాగం
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ మార్చ్ 15: మోపాల్ మండలంలోని నర్సింగ్ పల్లి లో గల ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా మహా పూర్ణాహుతి నిర్వహించి అనంతరం స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు.ఆలయ వీధుల్లో భక్తులు రథాన్ని లాగగా, వేలాదిమంది కదిలి రాగా గోవింద నామస్మరణతో మాడవీధులు పులకరించిపోయాయి. దిల్ రాజు సోదరులు శిరీష్ రెడ్డి, నరసింహారెడ్డి,విజయసింహా రెడ్డి స్వయంగా స్వామివారి రథాన్ని లాగుతూ ముందుకు నడిచారు. నర్సింగ్ పల్లి గ్రామ మహిళలు హారతులు పట్టుకొని స్వామివారికి స్వాగతం పలుకుతూ దారి వెంట నృత్యాలు చేసుకుంటూ నడిచారు. రథోత్సవం అనంతరం స్వామివారికి చక్రస్నానం కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ పుష్కరిణిలో స్వామివారికి చక్రస్నాన కార్యక్రమాన్ని దేవనాథ జీయర్ స్వామి వారు యజ్ఞాచారులు, వేద పండితులు, అర్చక స్వాములు నిర్వహించారు.పుష్కర బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఉదయం యాగశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు. మహా పూర్ణాహుతి అనంతరం త్రిదండి దేవనాథ్ జీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. భగవంతునిపై ప్రేమతో సేవలు చేస్తున్న ఇందూరు తిరుమల ఇలలో వైకుంఠంగా మారడం ఖాయమని వారు అన్నారు. మనుషులు సదా భగవంతునికి కృతజ్ఞతా పూర్వకంగా ఉండాలని అన్నారు. భగవంతుడు లోకకార్యం మనుషుల ద్వారా చేస్తారని భగవంతుడు కృపవలనే మనిషి గొప్పగా ఎదుగుతాడని అన్నారు. భగవంతుడు మనల్ని ఎంచుకునేందుకు అర్హత సాధించాలని మనిషి లోపల భూత దయ, ప్రకృతి పట్ల ప్రేమ, దేశభక్తి ఉండాలన్నారు. కలియుగంలో హరినామమే మోక్షమార్గం కాబట్టి ప్రతిక్షణం హరినామం జపిస్తూ ఉండాలని తాను మోక్ష మార్గాన్ని అనుసరిస్తూ సాటి మనిషికి కూడా మోక్షమార్గాన్ని చూపెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి దంపతులు, ప్రముఖ సినీ నిర్మాత సోదరులు దిల్ రాజ్ దంపతులు, శిరీష్ రెడ్డి దంపతులు, విజయసింహారెడ్డి దంపతులు, సుదర్శన్ రెడ్డి దంపతులు, ఎంపీటీసీ రాములు ఫోటో గంగాధర్, ప్రవీణ్, పృధ్వి నారాయణ, నర్సారెడ్డి, నరాల సుధాకర్, రమేష్ భాస్కర్, నరేందర్, రాజేశ్వర్, సాయిలు, గంగారెడ్డి, ప్రమోద్, భూంరెడ్డి, యజ్ఞచార్యులు అనంత ఆచార్యులు, రోహిత్ కుమారాచార్య విజయ్ స్వామి, అనిల్ స్వామి, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.











