భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి-కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా బ్యూరో జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన నందిపేట తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. నందిపేట మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమీక్షా సమావేశంలో తహసిల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment