మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి కృషి చేయాలని సమాఖ్య ప్రతినిధులకు పిలుపు
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 19 : (నవీన్ కుమార్) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ జిల్లాలో పూర్తి పారదర్శకంగా జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీ.సీలో పాల్గొన్న సమాఖ్య ప్రతినిధులకు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం పేరుతో ఇందిరమ్మ చీరల పంపిణీకి చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎలాంటి విమర్శలు, పొరపాట్లకు తావులేకుండా క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ అయ్యేలా సమాఖ్య ప్రతినిధులు కృషి చేయాలని అన్నారు. చీరల పంపిణీ కార్యక్రమం పర్యవేక్షణ కోసం నియోజకవర్గానికి ఒకరు చొప్పున స్పెషల్ ఆఫీసర్ ను నియమిస్తున్నామని అన్నారు. నిర్ణీత గడువు లోపు చీరల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కోసం ప్రతి గ్రామంలో 18 సంవత్సరాలు నిండిన యువతులు, మహిళల వివరాలను పక్కాగా సేకరించాలని సూచించారు.కాగా, రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇతోధికంగా తోడ్పాటును అందిస్తూ, అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని కలెక్టర్ గుర్తు చేశారు. ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడమే కాకుండా సామాజికంగా కూడా ప్రగతి పథంలో పయనించేలా సమాఖ్యలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల సభ్యులందరూ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేసుకుని, అవసరమైన వారు చికిత్సలు పొందేలా మహిళా సమాఖ్యలు చొరవ చూపాలన్నారు. అదేవిధంగా ప్రతి మహిళ చదువుకునేలా వయోజన విద్యా కార్యక్రమం విజయవంతానికి తోడ్పాటును అందించాలని కలెక్టర్ సూచించారు. చదువు నేర్చుకున్న వారు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలన్నారు. కల్తీ కల్లు, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై, ప్రత్యేకించి గర్భిణీలు వీటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో కృషి చేస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సాఫీగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, మున్సిపల్ కమిషనర్లు, మహిళా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.









