ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగవంతానికి స్పెషల్ డ్రైవ్.

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సుదీర్ఘ సమీక్ష.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, డబుల్ బెడ్రూంల పంపిణీ ప్రక్రియపై కలెక్టర్ ఎంపీడీఓలు, హౌసింగ్ ఏ.ఈలు, ఎంపీఓలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, ఇప్పటివరకు గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యలు ఏమిటి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలలో వెనుకంజలో ఉన్న ఆయా మండలాల అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి సాధించడం లేదని నిలదీశారు. వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని సూచించారు. మంజూరీలు పొందిన లబ్ధిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. లాగిన్ విషయంలో, ఇతరాత్ర ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు ఉన్నా, వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. బిల్లుల చెల్లింపులలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు లబ్దిదారుల వివరాలు ఆధార్ కార్డు వివరాలతో సరిపోలి ఉన్నాయా అన్నది పరిశీలించుకోవాలని,ఏవైనా మార్పులు అవసరం ఉంటే ఆధార్ అప్డేషన్ చేయించాలని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని సూచించారు. తానుఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తానని, ఎప్పటికప్పుడు స్పష్టమైన పురోగతి కనిపించాలని అన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ అంకిత్,హౌసింగ్ పీ.డీ పవన్ కుమార్, ఈ.ఈ నివర్తి, డీ.ఈ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment