ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక అక్టోబర్ 30 : (నవీన్ కుమార్) నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాల వల్ల తడిసిన,రంగు మారిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి, నష్టపోయిన రైతులకు తగిన సహాయం అందించాలని బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో లక్షల ఎకరాల్లో కోసిన వరి పంటను రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవడం, ప్రారంభమైన కేంద్రాల్లో కూడా వడ్ల కుప్పలు లేపకపోవడం వలన, ఇటీవలి భారీ వర్షాల కారణంగా రోడ్లపై, కల్లాల వద్ద ఉన్న ధాన్యం తడిసి నష్టపోయారని అన్నారు. ఫలితంగా రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని మాయిశ్చర్ కంటెంట్ కారణంగా తిరస్కరించకుండా బాయిల్ రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. రంగు మారిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కనీస మద్దతు ధర కు కొనుగోలు చేయాలని కోరారు. భవిష్యత్తులో అకాల వర్షాల ప్రభావం నుంచి రైతులను రక్షించేందుకు ప్రభుత్వం టార్పాలిన్లను ఉచితంగా లేదా సబ్సిడీతో అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతంకర్ లక్ష్మి నారాయణ, నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, బీజేపీ నాయకులు న్యాలం రాజు, పద్మరెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










