నిజామాబాద్ జై భారత్ ఆగస్టు 18 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు మంగళవారం సాయంత్రం లోపు ఆయా శాఖల వారీగా నివేదికలు రూపొందించి సమర్పించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు విషయమై అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలు, గురుకులాల భవనాలపై సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటు, నీటి పారుదల, మిషన్ భగీరథ శాఖలకు చెందిన ఖాళీ స్థలాలలో వీటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖల అధికారులు సౌర విద్యుత్ ఫలకాల ఏర్పాటుకు వీలుగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల భవనాల పూర్తి వివరాలను నిర్దేశిత నమూనాలో పొందుపరుస్తూ, మంగళవారం సాయంత్రం లోపు సమర్పించాలని, సౌర ఫలకాల ఏర్పాటుకు కావలసిన వైశాల్యం, విద్యుత్ కనెక్షన్ తదితర వివరాలను అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, డీఆర్డీఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్, మెప్మా పీడీ రాజేందర్ ఏసీపీ వెంకటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.












