నందిపేట్ సర్పంచ్‌గా ఎర్రం సిలిండర్ లింగం ఘన విజయం

1749 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు

నందిపేట ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 18 : ( షేక్ గౌస్) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎర్రం సిలిండర్ లింగం ఘన విజయం సాధించారు. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఆయనకు మొత్తం 3801 ఓట్లు లభించగా, సమీప ప్రత్యర్థిపై 1749 ఓట్ల భారీ మెజారిటీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు.ఈ ఎన్నికల్లో మంద మహిపాల్‌కు 2052 ఓట్లు, సుధాకర్ గౌడ్‌కు 1460 ఓట్లు, మన్పూర్ భూమేష్‌కు 319 ఓట్లు, ఇందూర్ ఏసుదాస్‌కు 33 ఓట్లు వచ్చాయి. నోటాకు 23 ఓట్లు నమోదయ్యాయి.ఎన్నికల ప్రచారంలో గ్రామ అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎర్రం సిలిండర్ లింగం ముందుకు సాగారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, విద్య, యువత ఉపాధి, రైతు సమస్యల పరిష్కారంపై స్పష్టమైన ప్రణాళికను ప్రజల ముందుంచారు. ప్రజల మధ్యే ఉండి సమస్యలు తెలుసుకునే నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపే ఈ విజయానికి కారణమని గ్రామస్తులు చెబుతున్నారు.గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సిలిండర్ లింగం మహారాష్ట్రలోని హివారీ బజార్ గ్రామాన్ని సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆ గ్రామంలో అమలవుతున్న నీటి సంరక్షణ, గ్రామ పాలన విధానాలను నందిపేట్‌లో అమలు చేయాలన్న సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.అదేవిధంగా, నందిపేట్ ఉపసర్పంచ్‌గా వాసరి రామ్‌చందర్ రెండోసారి ఎన్నిక కావడం విశేషంగా నిలిచింది. గ్రామ పాలనలో అనుభవం ఉన్న ఆయనకు ప్రజలు మరోసారి అవకాశం ఇవ్వడం గమనార్హం.ఫలితాలు వెలువడిన వెంటనే నందిపేట్ గ్రామంలో సంబరాలు వెల్లివిరిశాయి. మద్దతుదారులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.విజయం అనంతరం ఎర్రం సిలిండర్ లింగం మాట్లాడుతూ,“నాపై నమ్మకం ఉంచిన నందిపేట్ ప్రజలందరికీ కృతజ్ఞతలు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తాను” అని తెలిపారు.ఈ ఫలితంతో నందిపేట్‌లో స్థానిక రాజకీయాల్లో ఎర్రం సిలిండర్ లింగం ప్రభావం మరింత పెరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment