సరుకుల సరఫరాలో అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై చర్యలు తప్పవు
చిన్నారుల హాజరు 90% లక్ష్యం
డిసెంబర్ లోపు సౌకర్యాలన్నీ పూర్తి చేయాలి
మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్షా సమావేశంలో స్పష్టం చేసిన మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 24 : మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో (DWOs) శుక్రవారం నాడు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాలు, గుడ్లు, పప్పు, మంచి నూనె, బాలమృతం, మురుకులు, బియ్యం వంటి వస్తువుల సరఫరాపై జిల్లాలవారీగా సమీక్ష నిర్వహించిన ఆమె, కొన్ని జిల్లాల్లో సరఫరా 50 శాతానికి కూడా చేరకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో జరిగినట్లుగా సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి సీతక్క, అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు.చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఆదేశిస్తూ, టేక్ హోమ్ రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 90 శాతం లబ్ధిదారులు FRS విధానంలో సరుకులు అందుకుంటుండగా, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఉదయం 9 గంటల లోపు అంగన్వాడీ కేంద్రాలు తప్పనిసరిగా ప్రారంభం కావాలన్నారు. కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రతి నెల కనీసం ఒక కొత్త చిన్నారి చేరేలా చర్యలు తీసుకోవాలని, ప్లే స్కూళ్ల స్థాయిలోనే విద్యా నాణ్యత ఉండేలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు.ఈ నెలలో ఇప్పటి వరకు గర్భిణుల హాజరు 80%, బాలింతల హాజరు 85% ఉండటం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నారుల హాజరు ప్రస్తుతం 68% ఉండగా, దాన్ని 90%కు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించారు. జిల్లా అధికారులు ప్రతి నెలా పురోగతి నివేదికలను సమర్పించాలన్నారు.బాల్యవివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలవాలని పిలుపునిచ్చిన సీతక్క, ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అలాగే శక్తి సదనాలు, స్టే హోమ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు.మంత్రి సీతక్కతో పాటు సమీక్షలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఇతర అధికారులు పాల్గొన్నారు.











