సిరికొండ, 7 September
మండలంలోని కొండాపూర్ గ్రామంలో జండా గద్దె నిర్మాణం విషయంలో బంజారులు, గ్రామస్తుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. నిర్మాణ అనుమతులపై గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, బంజారులు నిర్వహించిన పూజా కార్యక్రమాలను వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
జండా గద్దె విషయంలో ఇరువర్గాల ఘర్షణ.. కొండాపూర్లో ఉద్రిక్తత తోపులాటలో పలువురికి గాయాలు.. లాఠీఛార్జితో పరిస్థితిని అదుపులోకి తెచ్చిన ( భారత్ స్పెక్ట్రామ్ ): మండలంలోని కొండాపూర్ గ్రామంలో జండా గద్దె నిర్మాణం విషయంలో బంజారులు, గ్రామస్తుల మధ్య సోమవారం ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలో జండా గద్దె నిర్మించేందుకు బంజారులు పనులు ప్రారంభించగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టవద్దని గ్రామ కార్యదర్శి సూచించడంతో నిర్మాణ పనులను నిలిపివేశారు. అనంతరం సోమవారం బంజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించగా, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో కొందరు గాయాలపాలైనట్లు సమాచారం. పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉండటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేశారు. జండా గద్దె నిర్మాణానికి సంబంధించిన సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరూ వ్యవహరించవద్దని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా సహకరించాలని అధికారులు ఇరువర్గాలకు సూచించారు. ప్రస్తుతం కొండాపూర్లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.












