నిజామాబాద్, జూలై 14
ఇటీవల మృతి చెందిన తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని సోమవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచులు పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. వేర్వేరు మండలాల సర్పంచుల ఫోరంల తరఫున రూ.2.75 లక్షలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఇటీవల మృతి చెందిన తాళ్ల రాంపూర్ గ్రామ సర్పంచ్ బెజ్జారపు పావని కుటుంబాన్ని సోమవారం వివిధ మండలాలకు చెందిన సర్పంచులు పరామర్శించి ధైర్యం చెప్పారు. పావని కుటుంబానికి తోటి సర్పంచులుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా వేల్పూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పడిగెల రాజు మాట్లాడుతూ, 'మా తోటి సర్పంచ్ బెజ్జారపు పావనిని తిరిగి తీసుకురాలేము. అయితే ఆమె కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యతగా భావిస్తున్నాము' అని తెలిపారు. వేల్పూర్ మండల సర్పంచుల ఫోరం తరఫున రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా ఆర్మూర్ మండల సర్పంచుల ఫోరం తరఫున అధ్యక్షుడు సారంగి శాంతి కుమార్, పావని కుమారులు భవిత్, భవిన్లకు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆలూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముక్కెర విజయ్ కూడా తన మండల ఫోరం తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించి, పావని కుటుంబానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.
మోర్తాడ్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు గడ్డం అనిల్ ఆధ్వర్యంలో స్వర్గీయ పావని కుటుంబానికి రూ.45,500 ఆర్థిక సహాయాన్ని అందించారు. బాల్కొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కౌడ భూమేష్, ఏర్గట్ల గ్రామ సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బట్టపూర్ సర్పంచ్ భూషణ వేణి ప్రవీణ్ యాదవ్, తడపాకల్ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, గుమ్మిర్యాల సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్, దొంచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని పలువురు ఉప సర్పంచులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.












