నిజామాబాద్, July
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య మరోసారి నొక్కి చెప్పారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని, ఇది నేరాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామాల్లో ఆయన 31 సీసీ కెమెరాలను ప్రారంభించారు.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి అని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు.
వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనగర్, జాకోర గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో 'మన ఊరు మన భద్రత మన బాధ్యత' కార్యక్రమంలో భాగంగా 31 సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడము ఎంతో సంతోషమని, ఒక్క సీసీ కెమెరా అనేది 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలను సులభంగా గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో కూడా ఈ కెమెరాలు పోలీసులకు సహాయపడతాయని వివరించారు.
ప్రజలు తమ ప్రాంతాల్లో భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కమిషనర్ సూచించారు. పోలీస్ శాఖ చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలకు ప్రజలు ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ వారి భద్రత కోసం సీసీ కెమెరాలను పెట్టాలని, దీనిని వారి బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు. దుకాణాల యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. శ్రీనగర్ గ్రామంలో 15, జాకోర గ్రామంలో 16 కెమెరాలు ఏర్పాటు చేసుకొని సహకరించిన గ్రామ పంచాయతీలను పోలీస్ కమీషనర్ అభినందించారు.
ఈ సందర్భంగా శ్రీనగర్, జాకోర గ్రామాలలో డ్రగ్స్ నివారణ, సైబర్ నేరాల పట్ల అవగాహన, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అన్నీ రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బోధన్ ఎ.సి.పి. శ్రీనివాస్, రుద్రూర్ సి.ఐ కృష్ణ, వర్ని ఎస్.ఐ జి. వంశీ కృష్ణ, కోటగిరి ఎస్.ఐ శ్రీనివాస్, రుద్రూర్ ఎస్.ఐ మనోజ్, శ్రీనగర్ సర్పంచ్ పూర్ణిమ కిరణ్, జాకోర సర్పంచ్ బి. పెద్ద సాయిలు, మాదాల చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు సుబ్బారావు, సెక్రెటరీ ఠాకూర్, రిటైర్డ్ సైంటిస్ట్ తోట చేతన్ కుమార్, ఏఎంసీ చైర్మన్ కె. సురేష్ బాబు, ఉప సర్పంచ్ దస్తగిరి, బాలవికాస్ ట్రస్ట్ సభ్యులు చంద రాములు, బాలయ్య, సాదిక్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.











