నిజామాబాద్, 1 August
ూఉజజబదజౌఅధృససోఉధ,
జిల్లాల్లో ఇప్పటివరకు ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకాలే జరగకుండా, ఉన్నట్టుండి వారి శిక్షణకు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల పి.ఆర్.టి.యు. తెలంగాణ నిజామాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్షణమే ప్రీ ప్రైమరీ టీచర్లను నియమించి, వారికి శిక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
పాఠశాలలు ప్రారంభమై 45 రోజులు గడిచినా, జిల్లాలోని 112 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకం పూర్తికాలేదని ఆయన తెలిపారు. టీచర్లు లేకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతోందని, అంతేకాకుండా విద్యార్థులకు సహాయకారిగా ఉండాల్సిన ఆయాల నియామకం కూడా చేపట్టలేదని పేర్కొన్నారు.
తెలంగాణ SCERT డైరెక్టర్ విడుదల చేసిన ఉత్తర్వుల (Rc No. 203/C&T/SCERT/TG/2025, తేదీ: 31.07.2026) ప్రకారం ఆగస్టు 3 నుండి 6 వరకు ప్రీ ప్రైమరీ టీచర్లకు శిక్షణా కార్యక్రమం, ఆగస్టు 7న ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, అసలు ఉపాధ్యాయుల నియామకమే జరగనప్పుడు ఈ శిక్షణ ఎవరికి ఇస్తారని ఆయన ప్రశ్నించారు.
జిల్లా విద్యాశాఖాధికారి (డి.ఇ.ఓ.) వెంటనే స్పందించి, తక్షణమే ప్రీ ప్రైమరీ టీచర్ల నియామకం పూర్తి చేసి వారికి శిక్షణ ఏర్పాట్లు చేయాలని పి.ఆర్.టి.యు. తెలంగాణ తరఫున కృపాల్ సింగ్ సోడి విజ్ఞప్తి చేశారు.











