జగిత్యాల, ఆదివారం
జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో నూతనంగా మంజూరైన కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన జరిగింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా చల్గల్ గ్రామంలో నూతనంగా మంజూరైన కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భూమి పూజలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ లు పాల్గొని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయానికి చల్ గల్ వాలంతరి భూములు కేటాయించడం ఒక సవాలుగా మారిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఒప్పించి క్యాబినెట్ లో తీర్మానం చేసి ఐదు ఎకరాల భూమిని కేటాయించినట్లు మంత్రి వివరించారు. కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ముఖ్యమంత్రితో పాటు నీటిపారుదల శాఖ మంత్రికి మంత్రి లక్ష్మణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయడం సంతోషమని మంత్రి తెలిపారు. పార్టీలకు అతీతంగా జగిత్యాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని కోరారు. సంక్షేమ శాఖ మంత్రిగా వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్రీయ విద్యాలయంలో 50 శాతం సీట్లను స్థానికులకు, 50 శాతం సీట్లను త్రివిధ దళాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తామని ఎంపీ తెలిపారు. ఈ విద్యాలయానికి ఐదు ఎకరాల భూమి కేటాయించినట్లే, మరో ఐదు ఎకరాల భూమిని కూడా కేటాయించాలని ఆయన కోరారు.
వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, పేద విద్యార్థుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కొరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.












