నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) - UG - 2026 రీ-ఎగ్జామ్ జూన్ 21న జరగనున్న నేపథ్యంలో, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బి.ఎన్.ఎస్.ఎస్ (144 సి.ఆర్.పి.సి) అమలు చేయనున్నట్లు ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
జూన్ 21, 2026న (ఆదివారం) జరగనున్న NEET-UG రీ-ఎగ్జామ్ ను సజావుగా నిర్వహించేందుకు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల వద్ద పోలీసు శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇంచార్జ్ పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్., తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
పరీక్ష జరిగే రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS (పాత సెక్షన్ 144 CRPC) అమలులో ఉంటుందని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ నిబంధనల ప్రకారం, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధమని, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు, పరీక్షల సమయంలో సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని తెలిపారు.
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతం కావాలని పోలీస్ కమిషనర్ ఆకాంక్షించారు. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.












