నిజామాబాద్, 11 July
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున జరిగిన మంగళసూత్రం, చోరీ ఘటనపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య స్పందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టౌన్-3 పోలీస్ స్టేషన్ పరిధిలోని దుబ్బ ప్రాంతంలో తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఓ మహిళ మెడలో నుంచి మంగళసూత్రాన్ని, కమ్మలను అపహరించిన ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సంఘటనా స్థలాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా బాధితురాలితో మాట్లాడి, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం దర్యాప్తు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను వెంటనే పరిశీలించాలని, నిందితులను గుర్తించి అత్యంత వేగంగా అరెస్టు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని, నేరస్తుల కదలికలను సాంకేతిక ఆధారాలతో విశ్లేషించాలని కమిషనర్ సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, నిజామాబాదు ఎ.సి.పి ప్రకాష్, టౌన్ సి.ఐ శ్రీనివాస్ రాజ్, టౌన్ 3 ఎస్.ఐ హరిబాబు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.











