సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ అన్నారు. సంస్థ చేపట్టిన పునర్జన్మ 2026 సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రతి నెలా నిర్వహించే సమీక్షా సమావేశంలో భాగంగా గురువారం ఇందూర్ యువత కార్యాలయంలో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. గత 16 ఏళ్లుగా సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పునర్జన్మ కార్యక్రమంలో భాగంగా రోడ్లపై దీనావస్థలో జీవిస్తున్న అనాథలు, అభాగ్యులు, నిరాశ్రయులు, విధివంచితులను గుర్తించి వారికి అవసరమైన సేవలు అందించనున్నట్లు వివరించారు. పెరిగిపోయిన గడ్డాలు, అట్టలు కట్టిన జుట్టుతో, మురికి వస్త్రాలతో అనామకులుగా జీవిస్తున్న వారిని చేరదీసి, వారికి వ్యక్తిగత శుభ్రత, సంరక్షణతో పాటు కొత్త రూపాన్ని అందించి, సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మానవత్వంతో కూడిన ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించేలా చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఇదే నెలలో సంస్థ ఆధ్వర్యంలో నిరంతరంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి 2,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు కార్యవర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సంస్థ భవిష్యత్ సేవా కార్యక్రమాల రూపకల్పనపై కూడా సభ్యులు చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్, జాయింట్ సెక్రటరీ రాచర్ల రాజేశ్ శర్మ, కార్యవర్గ సభ్యులు సుజాత రెడ్డి, కొండ నాగేందర్, బోడ హన్మాండ్లు, దర్శనం రాజు, రామగిరి సుధాకర్, కూన రాజు తదితరులు పాల్గొన్నారు.







