ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం ట్రాన్స్జెండర్లకు సూచించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు బుధవారం నిజామాబాద్ సీసీఎస్ పోలీస్ జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా వ్యవహరించాలని, ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి జీవించాలని సూచించారు. అనంతరం, ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామాజిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులను సంప్రదించాలని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నిరుత్సాహానికి గురికాకుండా చట్టపరమైన సహాయం పొందాలని సూచించారు. అత్యవసర సహాయం, ఇతర సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14427ను సంప్రదించవచ్చని తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు ట్రాన్స్జెండర్ల సమస్యలను గుర్తించి, వారికి తగిన మార్గదర్శకత్వం అందించడమే ఈ కౌన్సెలింగ్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ సీఐలు సురేష్, అజయ్, సాయినాథ్, ఎస్సైలు మహేష్, భీమ్రావు, మహిళా ఆర్ఎస్ఐ స్రవంతి, సఖీ సెంటర్ ఇన్చార్జి భానుప్రియతో పాటు జిల్లాకు చెందిన ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.










