ఆయిల్ పామ్ లక్ష్య సాధనలో నిర్లక్ష్యానికి తావిస్తే చర్యలు తప్పవు – కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ అక్టోబర్ 18 : జిల్లాలో నిర్దేశిత లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం కాగా, ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలని అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న ప్రీ-యునిక్ కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై క్లస్టర్ల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్య సాధనలో వెనుకబడి ఉన్న క్లస్టర్ల అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో విఫలమవుతున్న అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒప్పందానికి అనుగుణంగా కృషి చేయని పక్షంలో ప్రైవేట్ కంపెనీపై కూడా చర్యలు తీసుకునే అంశాలను పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోందని, ఎంతో లాభదాయకమైన ఈ పంట సాగును చేపట్టి రైతులు ఆర్ధిక అభ్యున్నతి సాధించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని కలెక్టర్ స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని పదేపదే సూచిస్తున్నప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోతున్నారని నిలదీశారు. ఈ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి రైతులకు సరైన విధంగా అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో ప్రణాళికాబద్దంగా కృషి చేస్తే, లక్ష్యానికి మించి ఆయిల్ పామ్ సాగు జరుగుతుందని అన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రస్తుత సమయం ఎంతో అనుకూలమని సూచించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మద్దతు ధర, సుదీర్ఘ కాలం పాటు ఏటేటా సమకూరే రాబడి తదితర అంశాలను అర్ధమయ్యే రీతిలో వివరిస్తూ, ఆదర్శ రైతులు ఈ పంటను సాగు చేసేందుకు ముందుకు వచ్చేలా చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఆయిల్ పామ్ సాగు లక్ష్య సాధన కోసం అవసరమైన తోడ్పాటును అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జె.గోవిందు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ప్రీ యూనిక్ కంపెనీ ప్రతినిధులు, ఆయా క్లస్టర్ల ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment