నిజామాబాద్ జై భారత్ మే:24 ( షేక్ గౌస్) వానాకాలంలో సంభవించే అజమాయిషీ, వరదలు, రవాణా ఇబ్బందుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.కార్డుదారులు తమ పరిధిలోని రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. చౌక ధరల దుకాణాల డీలర్లు ముందస్తుగా సరుకులను దిగుమతి చేసుకుని వినియోగదారులకు సకాలంలో బియ్యం పంపిణీ చేపట్టాలని సూచించారు. పంపిణీ ప్రక్రియను జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభించి, నెలాఖరులోపు పూర్తిచేయాలని ఆదేశించారు.బియ్యం పంపిణీలో ఆలస్యం, గందరగోళం, అక్రమాలు చోటుచేసుకోకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరగాలన్నదే అధికారుల ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. డీలర్లు తగిన విధంగా వ్యవహరించకపోతే, సంబంధితులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు సరుకులు సమయానికి చేరేలా అధికారులు చొరవ చూపాలని ఆదేశించారు.ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో సమర్థవంతంగా పంపిణీ జరిగేలా పౌర సరఫరాల శాఖ సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాలని సూచించారు. ప్రతి ఒక్క కార్డుదారుడికి ఆయన హక్కుగా ఉన్న బియ్యం నష్టపోకుండా, సురక్షితంగా అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.ఈ నిర్ణయంతో వర్షాకాలంలో రేషన్ కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండానే మూడు నెలల బియ్యం ఒకేసారి అందుబాటులోకి రానుంది.
మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ.
Published On: May 25, 2025 5:34 am
