నిజామాబాదు ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 12.
ఫార్మా కంపెనీ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, రెవెన్యూ అధికారులు, ఇతర అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి నాయకులు కెంపుల నాగరాజు, తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర నాయకులు హెచ్. రేవంత్ సోమవారం ప్రకటనలో తెలిపారు. అధికారులపై దాడికి ఉసిగొల్పిన, దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ లచ్చిరెడ్డి, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలల ఆదేశాల మేరకు నిరసనలు తెలుపుతామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారుల వాహనాలను సైతం ధ్వంసం చేశారని, ఇది దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు పెన్ డౌన్ చేస్తామన్నారు. సాక్షాత్తు జిల్లా మెజిస్ట్రేట్ అయిన కలెక్టర్ మీదనే దాడి జరగడం క్షమించరాని నేరమన్నారు. ఇదో ఆటవిక చర్యగా పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఆటవిక దాడులు జరగకుండా, ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని కోరారు. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, కఠిన కారాగార శిక్షలు పడేలా చూడాలన్నారు.
కలెక్టర్ పై దాడి ఆటవిక చర్య ఆందోళనకారులను శిక్షించాలి తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసి, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్
Published On: November 12, 2024 7:47 pm
