నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాలనీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నగర మేయర్ ఉమారాణి అన్నారు. శుక్రవారం ఆమె నిజామాబాద్ నగరంలోని 12వ డివిజన్లో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్తో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.
డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ, తాగునీటి సరఫరా, రోడ్ల సమస్యలపై మేయర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థలోని లోపాలు, తాగునీటి సరఫరాలో ఇబ్బందులు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు.
పరిశీలించిన సమస్యలపై మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, సంబంధిత అధికారులకు తక్షణమే చర్యలు చేపట్టి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మేయర్ ఆదేశించారు. మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం, పరిశుభ్రమైన, అభివృద్ధి చెందిన నగరాన్ని నిర్మించడమే తమ లక్ష్యమని మేయర్, కమిషనర్ తెలిపారు.
ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యను బాధ్యతగా స్వీకరించి, శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతి వార్డులో ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసే దిశగా నగర పాలక సంస్థ కట్టుబడి పనిచేస్తోందని వారు తెలిపారు.







