దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైకిల్, బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఉదయం 8 గంటలకు పూలాంగ్ చౌరస్తాలో అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి ప్రగతి హాస్పిటల్, ఎల్ఐసీ చౌరస్తా, కోర్టు చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా శుభం ప్రకాష్ మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రతను కాపాడేందుకు నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు, ఇతర సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళల భద్రత కోసం విధులు నిర్వర్తిస్తూ అమరులైన పోలీసుల సేవలను సమాజం ఎన్నటికీ మరువదన్నారు. ముఖ్యంగా నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజల రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ఈ నేలపై చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు. పోలీసుల త్యాగాల ఫలితంగానే ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని అన్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే సమాచారం అందించాలని కోరారు. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. పోలీస్ వ్యవస్థ అంతా ఒకే కుటుంబమని, పోలీస్ యూనిఫాం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. దేశం కోసం, న్యాయం కోసం ఎలాంటి పక్షపాతం లేకుండా తలవంచని ధైర్యంతో ప్రజలకు సేవలందించేందుకు ప్రతి పోలీస్ సిబ్బంది కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.











