ఈద్ సందర్భంగా గ్రామానికి వచ్చిన ముస్లిం కుటుంబంపై హింసాత్మక దాడి – ఐదుగురు తీవ్రంగా గాయాలు
నిజామాబాద్ జై భారత్ జూన్ 9 : జిల్లాలోని ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో శాంతియుతంగా జీవించేందుకు వచ్చిన ముస్లిం కుటుంబంపై మతపరమైన విద్వేషంతో దాడి జరిగింది. ఈ దాడిలో కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడినవారు బజరంగ్ దళ్‌కు చెందినవారని సమాచారం.వివరాల ప్రకారం, 2023 ఆగస్టు నెలలో సాజిద్ ఖాన్ అనే యువకుడు తన సోదరిని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా, గ్రామంలోని కొన్ని మతపరమైన శ్రేణులు అతనిపై దాడి చేశాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వాచ్ కమిటీ అనే సామాజిక సంస్థ, ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరించాలని తీర్పు చెప్పింది. దీంతో సాజిద్ ఖాన్ కుటుంబం గ్రామం వదిలి వెళ్లిపోయింది.ఈద్ సందర్భంగా, జూన్ 7న సాయంత్రం వారు తిరిగి గ్రామానికి వచ్చారు. అప్పటికే వేచి ఉన్న దుండగులు సుమారు 20 మంది గుంపుగా వచ్చి, సాజిద్ ఖాన్, అతని తండ్రి అహ్మదుల్లా, తల్లి, సోదరుడు, మరొక బంధువును మానవత్వానికి తిలోదకాలు అర్పించేలా దారుణంగా కొట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరించి చికిత్స అందిస్తున్నారు.బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, దాడికి పాల్పడినవారు వారిని గ్రామంలోకి అడుగుపెట్టకుండా చేయడమే లక్ష్యంగా ఈ విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు. ఘటనకు సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. అయితే ఇప్పటికీ ఎలాంటి అరెస్టులు జరగకపోవడం బాధితుల ఆవేదనకు దారితీసింది. సోమవారం ఎంఐఎం పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఫయాజుద్దీన్ , టౌన్ ప్రెసిడెంట్ షకీల్ అహ్మద్. మాజీ డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ AIMIM సీనియర్ నాయకుడు మీర్ మజాజ్ అలీ నిజామాబాద్ కమిషనర్ సాయి చైతన్య ను కలిసి దాడికి పాల్పడిన నిందితులను త్వరగా నిర్బంధించాలని చట్ట ప్రకారం కఠినమైన శిక్షలను విధించాలని కోరారు.