నిర్మల్ జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు 5వ రోజు.. సానుకూలంగా స్పందించిన మంత్రి.
శనివారం నల్ల రంగు దుస్తులు ధరించి నిరసన తెలిపిన జర్నలిస్టులు.
అదే సమయంలో మంత్రి రాక.. బైక్ ర్యాలీగా వెళ్లి రెడ్డి ఫంక్షన్ హాల్‌లో వినతి.
మాట నిలబెట్టుకున్న అల్లోల, కూచాడి.. మంత్రి వద్దకు జర్నలిస్టులను తీసుకెళ్లి విజ్ఞప్తి.
మాకు జీతాలు ఉండవు, ఇళ్ల స్థలాలతో పాటు ‘ఇందిరమ్మ’ ఇళ్లు ఇవ్వండి: ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్.
2, 3 రోజుల్లోనే కమిటీ వేసి సమస్య పరిష్కరిస్తామని మంత్రి హామీ.
నిర్మల్ జిల్లా ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 27 : (నాని భోజన్న) గత ఐదు రోజులుగా కొనసాగుతున్న నిర్మల్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలో భాగంగా.. శనివారం నల్ల రంగు దుస్తులు ధరించి నిరసన తెలిపారు జర్నలిస్టులు. ఇళ్ల స్థలాల సాధన కోసం చేపట్టిన ఈ పోరాటంలో భాగంగా 5వ రోజున వారు ఈ నిరసన చేపట్టారు.సంఘీభావం తెలిపిన నేతలు,ఈ దీక్షా శిబిరానికి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు, వివేకానంద యూనియన్ సభ్యులు, వైద్యులు మురళీధర్, ప్రమోద్ చంద్రారెడ్డి, టి.ఎన్.జి.ఓ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ తదితరులు హాజరై జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు.మంత్రి రాకతో ర్యాలీగా పయనం,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఈమధ్య కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తగా ఎన్నికైన సర్పంచులకు దిశానిర్దేశం చేసేందుకు, సన్మాన కార్యక్రమం కోసం స్థానిక రెడ్డి ఫంక్షన్ హాల్ కు వచ్చారు. మంత్రి వచ్చారన్న విషయం తెలుసుకున్న జర్నలిస్టులు, తాము ధరించిన నల్ల దుస్తులతోనే దీక్షా శిబిరం నుండి ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా బయలుదేరి మంత్రి ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు.మాట నిలబెట్టుకున్న నేతలు,అంతకుమునుపు దీక్షా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ డిసిసి అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు.. జర్నలిస్టులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మంత్రి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుపుతామని చెప్పిన దానిప్రకారం.. ఫంక్షన్ హాల్ వద్దకు వచ్చిన జర్నలిస్టులను చూసి, వారిని స్వయంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వద్దకు తీసుకెళ్లి మాట్లాడే అవకాశం కల్పించారు. జర్నలిస్టులు తమ వినతి ఏంటో, తమకు కావలసినది ఏంటో మంత్రికి చెప్పుకునేలా నేరుగా అవకాశం కల్పించారు.జర్నలిస్టుల జీవితాలకి ఓ దారి చూపండి.. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్,ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాసం శ్రీధర్, నాయకులు బాస, లక్ష్మీనారాయణ మంత్రికి వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం సమర్పించిన అనంతరం రాసం శ్రీధర్ మాట్లాడుతూ..”జర్నలిస్టులకు ప్రత్యేకంగా నెలవారీ జీతాలు అంటూ ఏమీ ఉండవు. ప్రతి సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమే పరమావధిగా భావిస్తుంటాం. అలాంటి మాకు దశాబ్దాలు గడిచినా కూడా ఇప్పటివరకు సొంత ఇల్లు, ఇంటి స్థలం లేకపోవడం బాధాకరం. కేవలం మాకు ఇదొక్క పని చేసి పెట్టండి. ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు, ఆ స్థలంలో ఇల్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు కూడా మంజూరు చేయాలి” అని మంత్రిని కోరారు.సానుకూల స్పందన – కమిటీ హామీ,జర్నలిస్టుల విజ్ఞప్తిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సానుకూలంగా స్పందించారు. “సమస్య పరిష్కారానికి కృషి చేస్తాను. మరో రెండు మూడు రోజుల్లోనే జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక కమిటీని వేసి, సమస్యను పరిష్కరిస్తాం” అని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంతో జర్నలిస్టులు ఆనందం వ్యక్తంచేశారు. 











