నిజామాబాద్, 16-07-2026
నిజామాబాద్ జిల్లాలో చిరుతపులిని హతమార్చిన కేసులో ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. భీమ్‌గల్ మండలం కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీరితో పాటు మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు సమాచారం.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని భీమ్‌గల్ మండలం, కారేపల్లి దక్షిణ బీట్ నందు ఒక చిరుతపులిని కొందరు వ్యక్తులు హతమార్చినట్లు వచ్చిన సమాచారం మేరకు కమ్మర్పల్లి రేంజ్ అధికారి కే అనిత మరియు సిబ్బంది విచారణ చేపట్టారు. ఈ క్రమంలో తాళ్లపల్లి గ్రామానికి చెందిన మలావత్ సంజీవ్, దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు అనే ఇద్దరు అనుమానిత వ్యక్తులను విచారించగా, తామే చిరుతపులిని హతమార్చినట్లు ఒప్పుకున్నారు.
వారిని విచారించగా, కారేపల్లి దక్షిణ బీట్ పరిధిలోని 79వ కంపార్ట్మెంట్లో హతమార్చిన చిరుతపులి కళేబరాన్ని దాచినట్లు తెలిపారు. కమ్మర్పల్లి అటవీ క్షేత్రాధికారి మరియు సిబ్బందికి వారు ఆ కళేబరాన్ని భూమిలో దాచిపెట్టిన ప్రదేశాన్ని చూపించగా, తామే స్వయంగా తవ్వి తీశారు. దానిని చిరుతపులి కళేబరంగా గుర్తించిన అటవీశాఖ అధికారులు నిందితులను మరింత లోతుగా విచారించారు.
విచారణలో మలావత్ సంజీవ్ భీంగల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల కాపరిగా గుర్తించారు. సుమారు ఒక నెల రోజుల క్రితం మేకల మందను కారేపల్లి అటవీ ప్రాంతంలో మేపడానికి వెళ్లగా, ఒక ఆడమేకను చిరుతపులి హతమార్చింది. ఈ విషయాన్ని తన గ్రామంలోని ఇతర వ్యక్తులకు చెప్పగా, దేవక్క పేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు, చిరుతపులి తిరిగి ఆ కళేబరం దగ్గరికి వస్తుందని, దాన్ని చంపి, దాని శరీర భాగాలను అమ్ముకుంటే లక్షల్లో డబ్బు వస్తుందని మలావత్ సంజీవ్‌కు ఆశ చూపాడు. ఆ రాత్రి మలావత్ సంజీవ్ తన గ్రామానికి చెందిన ఇతర నలుగురు వ్యక్తులతో కలిసి, ఆ కళేబరంలోకి గడ్డి మందును సిరంజి ద్వారా ఎక్కించాడు.
మరుసటి రోజు ఉదయం ఆ ప్రాంతానికి నిందితులు వెళ్లి చూడగా, చిరుతపులి చనిపోయి ఉంది. ఈ విషయాన్ని మలావత్ సంజీవ్, సిరిసిల్ల రాములు మరియు ఇతర నలుగురు వ్యక్తులకు తెలియజేశాడు. వారు అక్కడికి చేరుకున్న తర్వాత, ఆ కళేబరాన్ని దాచిపెట్టి, సరైన కొనుగోలుదారుడు దొరికిన తర్వాత దానిని తీసి అమ్ముకుందామని నిర్ణయించుకున్నారు.
చిరుత కళేబరాన్ని గుర్తించిన తర్వాత అటవీశాఖ అధికారులు విచారించగా, పై వివరాలను వెల్లడించారు. విచారణలో భాగంగా సిరిసిల్ల రాములు ఇంట్లో తనిఖీ చేయగా, అక్రమంగా దాచిన, ఎటువంటి లైసెన్స్ లేని ఒక నాటు తుపాకీ దొరికింది. దానిని అటవీశాఖ అధికారులు తదుపరి విచారణ నిమిత్తం భీంగల్ పోలీసులకు అప్పగించారు.
ఉద్దేశపూర్వకంగా వన్యప్రాణి అయిన చిరుతపులిని చంపిన నేరానికి, తేదీ 16-7-2026నాడు పై ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. ఇతర నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం 2022, తెలంగాణ అటవీ చట్టం మరియు జీవవైవిద్య చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. నిందితులను ఆర్మూర్ న్యాయస్థానంలో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.








