Bansuvada, ఆదివారం
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో రూరల్ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పోలీస్ హెల్త్ ఔట్ పోస్ట్, శాశ్వత సదరం క్యాంపులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ నూతన కార్యాలయాల ద్వారా ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందుతాయని తెలిపారు.
ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పోలీస్ హెల్త్ ఔట్ పోస్ట్, శాశ్వత సదరం క్యాంపును ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ సీఐ కార్యాలయాన్ని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్నివిధాలుగా కృషి చేస్తోందని తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ కార్యాలయాల ద్వారా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. దీనితో పోలీస్ సిబ్బందికి అక్కడికక్కడే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. దివ్యాంగులకు సర్టిఫికెట్లు, పెన్షన్ల కోసం శాశ్వత సదరం క్యాంపు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
బాన్సువాడ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. మన నియోజకవర్గంలో ప్రభుత్వ భవనాలు నిర్మించాము. సిద్ధపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైతులకు నీటి ఇబ్బందులు లేకుండా చేసాము. ఎక్కడైతే శాంతియుత వాతావరణం ఉంటుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అక్కడ బాన్సువాడలో త్వరలో డీఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తాము. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చాము. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ వయసులో కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారని కొనియాడారు. పట్టణంలోని తాడ్కోల్ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా వద్ద హెల్మెట్ లేకుండా రోడ్డుపై వస్తే ఫైన్లు వేస్తున్నారని, కొయ్యగుట్ట, బీర్కూర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పెట్టి ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వారికి ఫైన్లు వేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ... జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది. డయల్ 100 ద్వారా ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలు కాపాడాము. బాన్సువాడలో పోలీస్ శాఖకు కొత్త భవనాలు రావడం అభినందనీయం. పోలీస్ అధికారులకు కార్యాలయాలను ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే పోచారం కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.












