తన భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన భర్త దుబ్బాక బాలస్వామికి, నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ రెండు నేరాలకు గాను పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. ఈ మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన బాలస్వామి, సబ్బని ఉమా మహేశ్వరి ప్రేమించుకుని 12 సంవత్సరాల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు.
వారి దాంపత్య జీవితంలో ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. పిల్లలు ప్రస్తుతం పది, ఎనిమిదేళ్ల వయస్సులో ఉన్నారు. వారి జీవితం పదేళ్లుగా ఒడిదుడుకులతో కొనసాగింది. డబ్బులు అవసరమైనప్పుడు బాలస్వామి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించి, పుట్టింటి నుండి డబ్బు తీసుకురమ్మని బలవంతం చేసేవాడు. కూతురి బాధలు చూడలేక, అవసరమైనప్పుడు ఉమా తల్లి సబ్బని నిర్మల ఆదుకునేది. ధర్మారం గ్రామంలో నిర్మలకు ఒక ఓపెన్ ప్లాట్ ఉంది. దానిని అమ్మి, వచ్చే సగం డబ్బులు తనకు ఇవ్వాలని తల్లిదండ్రులను బలవంతం చేయమని కొన్నేళ్లుగా భార్యను వేధించాడు. భర్త వేధింపులు భరించలేక ఉమా మహేశ్వరి 2020లో తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో నేర అభియోగాలు కోర్టులో జరిగిన న్యాయ విచారణలో రుజువైనట్లు సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో నిర్ధారించారు.
భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 85 ప్రకారం, భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించినందుకు మూడు సంవత్సరాల కఠిన జైలు శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. సెక్షన్ 108 ప్రకారం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు మరో ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. జరిమానాలు చెల్లించని యెడల, అదనంగా మూడు నెలల చొప్పున జైలు శిక్ష అనుభవించాలని సెషన్స్ జడ్జి భారత తమ తీర్పులో పేర్కొన్నారు. జైలు శిక్షలన్నీ ముద్దాయి బాలస్వామి ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, కోర్టులో నేర అభియోగాలు రుజువైన నేపథ్యంలో, నిందితుడికి కఠిన శిక్ష పడింది. ఇది మహిళలపై జరిగే నేరాలకు ఒక హెచ్చరిక అని తెలిపారు.


