కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. గత నెల 28న జరిగిన ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని, హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ ఛాంబర్‌ను ముట్టడించి నిరసన తెలిపారు.
కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గత నెల 28న చోటుచేసుకున్న ర్యాగింగ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ రాజీనామా చేయాలని, సంబంధిత హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపాల్ ఛాంబర్‌ను ముట్టడించి లోపలే బైఠాయించి నిరసన తెలిపారు. ప్రిన్సిపాల్‌తో పాటు ఇతర ఉద్యోగులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కళాశాలలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న దేవునిపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు.
మరోవైపు ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాల్య స్పందిస్తూ.. ర్యాగింగ్‌కు పాల్పడిన 14 మంది విద్యార్థులను ఇప్పటికే సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.
అయితే ప్రిన్సిపాల్ వివరణపై సంతృప్తి చెందని విద్యార్థి సంఘాలు.. బాధ్యులపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని, కళాశాలలో విద్యార్థులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశాయి.












