నిజామాబాద్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్, సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.
టౌన్-4 పోలీస్ స్టేషన్ పరిధిలోని భూమా రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, సీసీఆర్బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశం, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దాడులు నిర్వహించాలని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారం తదితర కేసులను సమీక్షించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని సూచించారు. రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వారిపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రి పహారాను బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు, ఆన్లైన్ మోసాల బాధితులకు తక్షణ సహాయం అందించాలని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రాధాన్యమిస్తూ షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్‌ను మరింత సమర్థవంతంగా పనిచేయించాలని, విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచాలని సూచించారు. రాబోయే దేవి నవరాత్రుల పండుగ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, వాహనాల తనిఖీల్లో నిర్లక్ష్యం వహించకుండా 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్లను గుర్తించి సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, లింకు రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, రహదారులకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించడం, రోడ్డు ఇంజినీరింగ్ లోపాలను సంబంధిత శాఖల సమన్వయంతో సరిచేయడం వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డయల్ 112 సేవలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచి సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను నియంత్రించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించి, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, స్టేషన్ నిర్వహణ, రికార్డులు, పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై దృష్టి పెట్టాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.












