నిజామాబాద్ జై భారత్ మే:31 వక్ఫ్ సవరణ చట్టం–2025ను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్‌లో నిర్వహించిన నిరసన సభలో AIMIM శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. వారి తో పాటు పలువురు రాజకీయ, మతపరమైన నాయకులు పాల్గొని వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు.
“వక్ఫ్ ఆస్తులపై కన్నేసిన కేంద్రం” — అక్బరుద్దీన్ ఓవైసీ
ఈ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, “వక్ఫ్ ఆస్తులు ముస్లిం సమాజానికి ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా ఎంతో విలువైనవిగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వాటిని ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలనే ప్రయత్నం చేస్తోంది. ఇది ముస్లింల హక్కులపై నేరుగా దాడి. ఈ బిల్లును మేము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించము. ఇది ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం,” అని హెచ్చరించారు.
“మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే బిల్లు” — షబ్బీర్
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, “మందిర్–మసీదు అంశాలను మళ్లీ ముందుకు తెచ్చి ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. మసీదులు, దర్గాలు, ఖబర్‌స్తాన్‌లను స్వాధీనం చేసుకోవాలన్నదే వక్ఫ్ బిల్లులోని అసలు ఉద్దేశం. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య.ఇతర మతాల ఆరాధనా స్థలాలపై ఆయా మతాలవారే యాజమాన్యం నిర్వహిస్తున్నారు. అలాంటి పరిస్థితిలో వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను చేర్చడమేమిటి?” అని ఆయన ప్రశ్నించారు.“సుప్రీంకోర్టులో న్యాయపోరాటం సాగుతోంది ఈ బిల్లు పార్లమెంటులో స్వల్ప మెజారిటీతో ఆమోదించబడింది. నేను నా స్వంత ఖర్చులతో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశాను. మతసామరస్యాన్ని కాపాడేందుకు అన్ని సెక్యులర్ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసికట్టుగా ఉద్యమం చేయాలి,” అని షబ్బీర్ పిలుపునిచ్చారు.ప్రజాభాగస్వామ్యంతో విజయవంతమైన సభ
ఈ కార్యక్రమంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, వివిధ ముస్లిం సంఘాల నాయకులు, మతపరమైన ప్రతినిధులు పాల్గొన్నారు. వేలాది మంది ముస్లిం సోదరులు ఈ సభకు హాజరై, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తించారు. వక్ఫ్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.