నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఫిబ్రవరి 28.
నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో పన్ను బకాయిలున్న వ్యాపార, వాణిజ్య సంస్థలు వెంటనే బకాయిలను చెల్లించాలని, లేని యెడల కఠిన చర్యలు తప్పవని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కేంద్రం లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పన్ను వసూళ్లలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల బృందం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు . ఈ సందర్భంగా ట్రేడ్ లైసెన్స్ మరియు ప్రాపర్టీ టాక్స్ బకాయిలను పరిశీలించి, పన్ను చెల్లించని సంస్థలపై చర్యలు చేపట్టారు.నగర అభివృద్ధికి పన్నుల చెల్లింపులు అత్యవసరమని, అందుకు ప్రతి వ్యాపారస్తుడు సహకరించాలని కమిషనర్ కోరారు.
సీజ్ చేసిన దుకాణాల వివరాలు..
వినాయక్ నగర్లోని విశాల్ మార్ట్ – ₹4 లక్షల పన్ను బకాయి
ఎల్.జీ. షోరూం – ₹2 లక్షలకు పైగా బకాయి
ఈఎంసీ బ్యాంక్ – ₹4 లక్షలు
ఇతర చిరు దుకాణాలు – ₹6.18 లక్షలు
బకాయిదారులకు పలు దఫాలుగా నోటీసులు జారీచేసినా, నిర్లక్ష్యం గా వ్యవహరించి టాక్స్ చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో దుకాణాలను సీజ్ చేయాల్సి వచ్చిందని కమిషనర్ వివరించారు. ఇది నిరంతర ప్రక్రియ అని బకాయిలను చెల్లించని వారికి ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత చర్యలు వుంటాయని స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.