నిజామాబాద్ జై భారత్ మే:24 (షేక్ గౌస్) ప్రజాసేవ పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాపార ధోరణిని అవలంబిస్తున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిజామాబాద్‌లోని మెడికోవర్ హాస్పిటల్ ఫార్మసీలో ఒక రోగికి సగం మందులు ఇవ్వడానికి నిరాకరించిన ఘటన తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. ఈరోజు ఓ మహిళ ఆరోగ్య సమస్యలతో మెడికోవర్ హాస్పిటల్ నందు చూపించుకోగా వైద్యుడు 10 రోజుల మందుల ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేక ప్రస్తుతం ఐదు రోజుల మందులు మాత్రమే కొనుగోలు చేస్తానని తెలిపి, మిగతా మందులు ఐదు రోజుల తర్వాత తీసుకుంటానని ఫార్మసీ సిబ్బందిని కోరారు.అయితే ఫార్మసీ సిబ్బంది “మేము పత్తి కట్ చేసి సగం మందులు ఇవ్వము. పూర్తిగా తీసుకోవాల్సిందే” అంటూ ఘాటు ధోరణితో తిరస్కరించారు. చేసేది ఏమీలేక ఆమె ఇతరుల సహాయంతో (ఫోన్ పే ద్వారా) డబ్బులు తెప్పించి 10 రోజుల మందులు కొనుగోలు చేసుకున్నారు.ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్తలు, హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పందించాయి. “ఇది ఒక రోగికి జరిగిన సంఘటన కాదు. ఈ తరహా వ్యవహారాలు అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూస్తూనే ఉన్నాం. ప్రజల అవసరాలను గౌరవించకుండా, వాణిజ్య దృక్పథంతోనే మెడికల్ సేవలు అందించడము దుర్భాగ్య కరమైన హేయమైన విషయం” అని పేర్కొన్నారు.వైద్య నిపుణులు అభిప్రాయపడుతూ – “రోగులు డాక్టర్ సూచించిన మేరకు మందులు తీసుకోవాల్సిందే. అయితే ఆర్థికంగా బలహీనులైన వారు తమకు సాధ్యమైనంత వరకు తీసుకునే అవకాశాన్ని ఆసుపత్రులు కల్పించాల్సింది పోయి, ఇలా వ్యవహరించడం నైతిక విలువలకు వ్యతిరేకం” అని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రజలు, హక్కుల సంఘాలు, ఆరోగ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తూ – “డ్రగ్ కంట్రోల్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ తక్షణమే జోక్యం చేసుకుని ఇటువంటి ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి రోగికి అవసరమైనంత మందులు విభజించి అందించే విధంగా ఫార్మసీలను కట్టడి చేయాలి” అని విజ్ఞప్తి చేస్తున్నారు.