నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 25.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో మాత్రమే కాకుండా, కోట్లాది భారతీయులను న్యాయం, సమానత్వం, సామాజిక ఐక్యత కోసం ఐక్యం చేసిన మహానీయుడని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు ఖాలేద్ జాఫర్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జమాత్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన అసభ్యమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో అసహనాన్ని పెంచుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.అదేవిధంగా, వక్ఫ్ భూముల రక్షణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గత దశాబ్దంలో వక్ఫ్ భూముల కేటాయింపులపై విచారణ జరిపి, అక్రమ కేటాయింపులను రద్దు చేయాలని, ధరణి పోర్టల్ వల్ల ప్రభావితమైన భూములను రక్షించాలని కోరారు. వక్ఫ్ భూముల సమర్థవంతమైన వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఎన్నికల హామీలను అమలు చేయడం సంతోషకరమని, అయితే మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధుల పూర్తి విడుదల, ప్రతీ మండలంలో అంతర్జాతీయ పాఠశాలల స్థాపన, మరియు ముస్లింలకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.జమాతే ఇస్లామీ హింద్ గత 75 సంవత్సరాలుగా విద్య, ఆరోగ్యం, వడ్డి రహిత మైక్రో ఫైనాన్స్, సామాజిక సేవ వంటి రంగాల్లో ప్రజల శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తూ, సమాజంలో నైతిక విలువలు, శాంతి మరియు సామాజిక ఐక్యతను పెంపొందించే దిశగా కృషి చేస్తోందని ఖాలేద్ జాఫర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ దావూదీ తో పాటు రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.