ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 21 : యువకులు, విద్యార్థులకు ప్యాకెట్ల రూపంలో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర దందాను మోపాల్ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి మొత్తం 1.2 కిలోల గంజాయి, ఏడు సెల్‌ఫోన్ లు స్వాధీనం చేశారు. వివరాలను సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు.కంజర గ్రామంలో గంజాయి విక్రయిస్తోందన్న విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో మోపాల్ ఎస్సై సుస్మిత సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న నిజామాబాద్ వినాయక్ నగర్‌కు చెందిన అమీర్ ఖాన్, నర్సింపల్లి ప్రాంతానికి చెందిన షేక్ అఫ్రోజ్, కంజర గ్రామానికి చెందిన బత్నాశ్ శివలను అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ పేర్కొన్నారు.నిందితులు ముగ్గురు కలిసి మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇమ్రాన్, మీర్జా జుబేర్ బేగ్, అమూల్ చౌరే, షేక్ షేర్ ఖాన్ల వద్ద నుంచి కిలోల కొద్దీ గంజాయి కొనుగోలు చేసి నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. కొనుగోలు చేసిన గంజాయిని చిన్న ప్యాకెట్లుగా విడదీసి, ఒక్కొక్కటీ రూ,200–రూ,300లకు యువకులు, విద్యార్థులకు అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు.దాడుల్లో నాందేడ్‌కు చెందిన నలుగురు వ్యక్తుల వద్ద 900 గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేశామని సీఐ సురేష్ తెలిపారు. కేసును ఛేదించిన సౌత్ రూరల్ సిబ్బందిని, మోపాల్ ఎస్సై ను సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించినట్లు సీఐ పేర్కొన్నారు.
యువతను లక్ష్యంగా చేసుకున్న గంజాయి ముఠా,ఏడు మంది అరెస్ట్ ,1.2 కిలోల గంజాయి స్వాధీనం–మోపాల్ ఎస్సై జెడ్.సుస్మిత
Published On: November 21, 2025 9:26 pm









