1.2 కిలోల గంజాయి, బైకు, ఫోన్లు స్వాధీనం-వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 20 : జిల్లాలోని యువతను లక్ష్యంగా చేసుకుని నిషేదిత గంజాయిని మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠాను బాల్కొండ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాల్కొండ శివారులోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ సమీపంలో గంజాయి విక్రయం జరుగుతున్నట్టు గుర్తించారు. సిఐ జాన్ రెడ్డి, ఎస్ ఐ శైలేందర్ నేత్రత్వంలో నయిమ్, అద్నాన్, మనోజ్, గోవిందు, ఒక బాలుడు గంజాయిని ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్దంగా ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు అంజాద్ అలీ గతంలోను పలు మార్లు వేల్పూర్, ఆర్మూర్ ప్రాంతాల్లో గంజాయి కేసుల్లో జైలుకు వెళ్లాడని అన్నారు. అయినా తీరు మార్చుకోకుండా ఈ సారి తన తమ్ముడు వహీద్ సుల్తాన్ తో కలిసి ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. మహారాష్ట్ర లోపి కిన్వాత్ కి చెందిన మున్ని అనే మహిళ వద్ద కిలో గంజాయిన రూ.20 వేలకు కొనుగొలు చేస్తున్నాడు. ఆ గంజాయిని ఆర్మూర్, బాల్కొండ పరిసరాల్లో 5 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా విడగొట్టి ఒక్కో ప్యాకెట్ కు రూ.400 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నాడని తెలిపారు.గంజాయి అమ్మిన ప్రతి ప్యాకెట్ పై ఏజెంట్లకు రూ.100 చొప్పున కమిషన్ ఆశ చూపి యువతను ఈ ఊబిలో కి లాగుతున్నాడని పేర్కొన్నారు.నిందితుల నుంచి 1.2 కిలోల ఎండు గంజాయిని, స్మార్ట్ ఫోన్లు, ఒక హీరో ప్యాషన్ ప్రో బైక్, ప్యాకింగ్ కోసం వాడే జిప్ లాక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ దందాలో బాల నేరస్తుడిని వాడుకున్నందుకు జువైనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే పరారీలో ఉన్న మున్ని, వహీద్ సుల్తాన్, సోఫియాన్, మోసిన్ ల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని అన్నారు.










