నిబంధనల ఉల్లంఘన, అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫారాలు విక్రయిస్తున్నారనే ఆరోపణలపై నారాయణ కళాశాలను జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఇఓ) రవికుమార్ సీజ్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట నిరసన ప్రదర్శన జరిగింది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నారాయణ కళాశాల అధిక ధరలకు యూనిఫారాలు, పుస్తకాలు విక్రయిస్తోందని, కార్పొరేట్ ఫీజుల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులను దోచుకుంటోందని ఆరోపణలున్నాయి. బిల్డింగ్ పర్మిషన్ లేకున్నా కళాశాల నడుపుతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నిరసనకు దిగింది.
శుక్రవారం సుభాష్ నగర్ లోని నారాయణ కళాశాల ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవికుమార్ వెంటనే కళాశాలను సీజ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రైవేట్ విద్యాసంస్థల అక్రమాలకు అడ్డేసినట్లుగా మారింది.
ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ, జిల్లాలోని ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలను పట్టించుకోవడం లేదని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కళాశాల ప్రాంగణాల్లోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫారాలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే సీట్లు అయిపోతాయనే భయాన్ని సృష్టించి అడ్మిషన్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై టాస్క్ ఫోర్స్ కమిటీలతో తనిఖీలు చేపట్టాలని, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న కళాశాల గుర్తింపును రద్దు చేయాలని శశిధర్ డిమాండ్ చేశారు. కేవలం విద్య బోధనకు సంబంధించిన ఫీజులు మాత్రమే వసూలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏబీవీపీ నాయకులు పాల్గొన్నారు.











