ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని, ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులలో పిల్లలను చేర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మోపాల్ మండలం బోర్గాం(పి) జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యా బోధనతో పాటు సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు.
తమ పిల్లలను ప్రైవేటు బడుల నుండి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తున్నామని తల్లిదండ్రులు తెలపడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల భారం, ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు.
బోర్గాం(పి) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదవ తరగతిలో 87 శాతం ఉత్తీర్ణత సాధించడం ప్రభుత్వ బడుల సామర్థ్యానికి నిదర్శనమని కలెక్టర్ అన్నారు. ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకుని విద్యార్థులు చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆమె సూచించారు.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ బడులలో విద్యా ప్రమాణాలు, బోధనను మెరుగుపరుస్తోందని, ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తోందని కలెక్టర్ గుర్తు చేశారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, దుస్తులు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదుల కొరతను అధిగమించడానికి పాఠశాల విస్తరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.








