నిజామాబాద్, జూలై 3
నమ్మకంగా ఉన్న ఉద్యోగులే యజమానిని మోసం చేసి 70 లక్షలకు పైగా నగదును కాజేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిలీ రసీదులు సృష్టించి, కార్యాలయ రికార్డులను మార్చి ఈ అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
స్కానింగ్ సెంటర్ యజమానికి నమ్మకంగా ఉంటూ లక్షల్లో దోచుకున్న ఇద్దరు ఉద్యోగుల ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఉద్యోగుల అక్రమ దోపిడీని గుర్తించిన యజమాని వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించడంతో వారి బాగోతం బయటపడింది. లోతుగా విచారణ జరిపిన వన్ టౌన్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఒకరిని అరెస్టు చేయగా మరో ఇద్దరు పరార్ లో ఉన్నట్లు తెలిసింది.
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కానింగ్ కేంద్రంలో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు గుండారం సత్యనారాయణ, మీనా నకిలీ నగదు రసీదులు తయారు చేసి, సంస్థ యాజమాన్యాన్ని మోసం చేసి రూ.70 లక్షలకు పైగా నగదును కాజేశారనే ఆరోపణలపై ఒకటవ టౌన్ పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని వన్ టౌన్ ఎస్ హెచ్ ఒ రఘుపతి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఓ ప్రధాన స్కానింగ్ కేంద్రం 2009 సంవత్సరం నుంచి సేవలు అందిస్తోంది. ఈ కేంద్రంలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న గుండారం సత్యనారాయణ, టి. మీనా లు కలిసి పథకం ప్రకారం సంస్థను మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, రోగులకు ఇచ్చే అసలు నగదు రసీదుల్లో కార్బన్ పేపరు తొలగించి, అనంతరం అదే బిల్లు నంబర్ పరీక్షల వివరాల మొత్తాలను తక్కువగా చూపిస్తూ నకిలీ రికార్డులు తయారు చేసినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. రోగులకు అసలు మొత్తంతో కూడిన రసీదు ఇచ్చిన తర్వాత, కార్యాలయ రికార్డుల్లో మాత్రం పరీక్షల వివరాలు, ఫీజులను మార్చి నమోదు చేయడం ద్వారా రోజువారీ నగదును దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. ఈ విధానం సుమారు ఆరు సంవత్సరాలుగా కొనసాగిందని, ఈ కాలంలో రూ.70 లక్షలకు పైగా సంస్థకు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ అక్రమాల గురించి ఇతర ఉద్యోగులు వెల్లడించకుండా వారిని బెదిరించడం, కొన్ని ఆధారాలను మాయం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి 2025 జనవరి నుంచి జూలై వరకు ఉన్న కొన్ని నగదు రసీదుల ప్రతులను పోలీసులకు సమర్పించినట్లు ఫిర్యాదులో వివరించారు.
ఫిర్యాదు స్వీకరించిన ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమంగా యజమానికి టోకరా వేసిన డబ్బులతో గుండారం సత్యనారాయణ తన భార్య పేరిట భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీలు, నగదు రసీదులు, సంబంధిత రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించి గుండారం సత్యనారాయణతో పాటు మీనా, సత్యనారాయణ భార్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి వెల్లడించారు. శుక్రవారం మాణిక్ బండారు గ్రామంలో గుండారం సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు మహిళలు పరార్ లో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపారు.










