నిజామాబాద్ నగర శివారులోని మాణిక్ బండర్ కు చెందిన మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి వినయ్ పై, అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో కత్తితో దాడి చేశారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక వ్యక్తిపై కత్తితో దాడి జరగడం జిల్లాలో కలకలం రేపింది. బాధితుడు వినయ్ అరుపులు విన్న పోలీసులు వెంటనే స్పందించి, అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొరుగువారు వినయ్ కు సంబంధించిన భూమిని మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు ఇవ్వాలని కోరడం, దీనికి వినయ్ నిరాకరించడంతో గొడవకు దారితీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వినయ్ పై ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి తో అతడు నాలుగు చోట్ల గాయపడ్డాడు. వినయ్ కేకలు విని బయటకు వచ్చిన పోలీసులు అతడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై నార్త్ రూరల్ సర్కిల్ సిఐ శ్రీనివాస్ స్పందిస్తూ, ప్లాట్ వివాదంలో గొడవలు జరిగి కత్తిపోట్లు జరిగినట్లు తెలిపారు.


