దీపావళి పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాటను పూర్తిగా నిషేధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. పండుగ సమయంలో పేకాట ఆడినా, ఆడించినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పేకాట కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. పేకాట స్థావరాలు నిర్వహించినా, ఇతరులను ప్రోత్సహించినా, లేదా నిర్వహణకు సహకరించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు. పండుగ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను, పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రజలు తమ పరిసరాల్లో పేకాట కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659700 కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. ప్రజలు పోలీసులకు సహకరించి, పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సూచించారు.


