కలెక్టర్ ఇలా త్రిపాఠి
-అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్-ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
జై భారత్ దినపత్రిక నిజామాబాద్ ఫిబ్రవరి 4 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ పత్రాల ముద్రణలో అత్యంత గోప్యత పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. బుధవారం ఆమె నగర పాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించి కమిషనర్ దిలీప్ కుమార్‌తో కలిసి ఎన్నికల ఏర్పాట్లు, డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పూర్తయినందున బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ ముద్రణ పనులు ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జరగాలన్నారు. ముద్రణ పూర్తయిన వెంటనే ప్రెస్ నిర్వాహకుల వద్ద హార్డ్ డిస్క్‌లోని సాఫ్ట్ కాపీలను పూర్తిగా తొలగించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ముద్రించిన బ్యాలెట్లను పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లకు తరలించాలన్నారు.జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామని, సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు సిబ్బందిని నియమిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను మరోసారి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డీఆర్డీవో సాయాగౌడ్, ఆర్డీవో రాజేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.











