ఇస్లామిక్ బోధనలను ఆచరణలో చూపుతూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి యువత ముందుకు రావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. నిజామాబాద్లో జమాఅతే ఇస్లామీ హింద్, ఎస్ఐఓ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఖిల్లా రోడ్డులో బహార్ హో కే ఖిజాన్, లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే అంశంపై బహిరంగ సభ జరిగింది.
జమాఅతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షుడు మౌలానా వలియుల్లా సయీదీ ఫలాహీ మాట్లాడుతూ.. ఇస్లాం సంపూర్ణ జీవన విధానమని, వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వ్యాపార రంగాలకు మార్గదర్శకత్వం అందిస్తుందని తెలిపారు. ప్రవక్త ముహమ్మద్ (స) జీవితం మానవాళికి ఆదర్శమని తెలిపారు. పేదలు, అనాథలు, బలహీనుల హక్కులను కాపాడాలని, సమాజంలో న్యాయం, సమానత్వం నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించారు.
మతపరమైన విభేదాలకు దూరంగా ఉంటూ ఐక్యతను పెంపొందించాలని, దేశంలో శాంతి, సోదరభావం, జాతీయ సమైక్యత బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
యువత సామర్థ్యాలు
ఎస్ఐఓ జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత తమ సామర్థ్యాలను గుర్తించి స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగాలని సూచించారు. స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకొని, సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు.
మానవత్వ సందేశం
ఎస్ఐఓ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. మానవాళిని అంధకారం నుంచి వెలుగువైపు నడిపించడంలో ముస్లింలు బాధ్యతాయుత పాత్ర పోషించాలని తెలిపారు. జమాఅతే ఇస్లామీ హింద్ తెలంగాణ షూరా సభ్యుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ.. ప్రవక్త ముహమ్మద్ (స) బోధనల ద్వారా సమాజంలో వివక్ష, అసమానతలను తొలగించి న్యాయాన్ని నెలకొల్పాలని పేర్కొన్నారు.
జమాఅతే ఇస్లామీ హింద్ తెలంగాణ అధ్యక్షుడు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ.. సామూహిక కృషి, స్పష్టమైన లక్ష్యంతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జమాఅతే ఇస్లామీ హింద్ నగర నాజిమ్ అబ్దుర్ రెహమాన్ దావూదీ, స్థానిక అమీర్లు అబ్దుల్ సత్తార్ ఖాన్, మహమ్మద్ ఖాలిద్ అహ్మద్, మహమ్మద్ గౌస్ పాషా, మహమ్మద్ అబ్దుల్ రహీమ్, ఎస్ఐఓ నిజామాబాద్ అధ్యక్షుడు సయ్యద్ అన్సార్ అలీతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. మహమ్మద్ ఫైసల్ ఖాన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, మహమ్మద్ ఖాలిద్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.









