కమ్మర్పల్లి జై భారత్ జూలై 30 : కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాలలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, సహకార సంఘాల ఎరువుల గిడ్డంగులను కలెక్టర్ సందర్శించారు. ముందుగా కమ్మర్పల్లి పీ.హెచ్.సీని తనిఖీ చేసిన కలెక్టర్, వైద్యులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఇన్ పేషంట్ వార్డు, లాబొరేటరీ, ఫార్మసీ గదులను తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్, గర్భిణీ మహిళల వివరాల నమోదు, వారికి నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షలు, సబ్ సెంటర్ల పరిధిలో కొనసాగుతున్న ఆరోగ్య సేవలు, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న ముందస్తు చర్యలు తదితర అంశాలపై పనితీరును సమీక్షించి, రికార్డులను పరిశీలించారు. ప్రతి గర్భిణీకి సంబంధించి రిజిస్ట్రేషన్ తప్పనిసరి జరగాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు గర్భం దాల్చిన ప్రతి మహిళ వివరాలు నమోదు చేయించి, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిగేలా చూడాలన్నారు. గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోని వారిపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. లింగ నిర్ధారణ కోసం ఎవరైనా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం చేసేందుకు అవకాశాలు ఉన్నందున, క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే ఆశాలు, ఏఎన్ఎం లు నిశిత పరిశీలన చేయాలన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ, అబార్షన్ లు వంటివి జరుగుతున్నట్లు గమనిస్తే, పై అధికారులకు వెంటనే సమాచారం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని, అన్ని రకాల మందులు సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే గర్భిణీలకు సాధారణ కాన్పులు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. అనంతరం కలెక్టర్ కమ్మర్పల్లి, మోర్తాడ్ మండల కేంద్రాల్లోని సహకార సంఘాల ఎరువుల గిడ్డంగులను తనిఖీ చేశారు. కమ్మర్పల్లి ఎరువుల గోడౌన్ లో స్టాక్ బోర్డుపై వివరాలు ప్రదర్శించకపోవడం గమనించిన కలెక్టర్, సొసైటీ కార్యదర్శిని నిలదీశారు. అప్పటికప్పుడు స్టాక్ వివరాలు రాయించారు. సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ రైతులకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలన్నారు.
ఆయిల్ పామ్ నర్సరీ సందర్శన
కాగా, ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో గల ఆయిల్ పామ్ నర్సరీని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం సందర్శించారు. నర్సరీలోని మొక్కలు ఆరోగ్యకరంగా పెరుగుతుండడం చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. లక్షన్నర ఎకరాల విస్తీర్ణంలో పంటల సాగుకు సరిపడా మొక్కలు నర్సరీలో అందుబాటులో ఉన్నాయని నర్సరీ నిర్వాహకులు తెలిపారు. ఆయిల్ పామ్ పంట వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తూ, రైతులు ఆయిల్ పామ్ సాగు విరివిరిగా చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఉద్యానవన శాఖ అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తామని అన్నారు. కలెక్టర్ వెంట ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు తదితరులు ఉన్నారు.











