నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి 13: (షేక్ గౌస్ )
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని కోటార్మూర్ (పెర్కిట్)లో నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన లేఅవుట్లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు రద్దు చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు.
చెరువుల పరిరక్షణ – ప్రజా ఫిర్యాదులు.
తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, కోటార్మూర్-పెర్కిట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్ల అభివృద్ధి జరగడంతో స్థానిక ప్రజలు, విద్యావంతులు అధికారులు వద్ద ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో నీటి పారుదల మార్గాలను మూసివేసి లేఅవుట్లు అభివృద్ధి చేశారని విచారణలో గుర్తించిన అధికారులు, వాటిని రద్దు చేయాలని నిర్ణయించారు.
కోటార్మూర్‌లో రద్దయిన లేఅవుట్లు
కోటార్మూర్ గ్రామంలోని 123, 127, 171 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన లేఅవుట్ల కారణంగా ఊర చెరువు, కొత్తకుంట కాలువ ప్రవాహ మార్గాలు పూర్తిగా మూసివేయబడ్డాయని EE, ఇరిగేషన్ డివిజన్ No.3, ఆర్మూర్ తన నివేదికలో పేర్కొన్నారు. వర్షాకాలంలో స్వల్ప వర్షం వచ్చినా నీటి నిల్వ సమస్య తలెత్తుతోందని, వరద ముప్పు పెరిగే ప్రమాదముందని నివేదిక స్పష్టం చేసింది.
సమీక్షా సమావేశం – కఠిన ఆదేశాలు
ఈ నివేదిక ఆధారంగా మార్చి 7న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, NUDA ప్రతినిధులు పాల్గొన్నారు. G.O.Ms No. 105, MA & UD Dept, 05.07.2021 ప్రకారం, లేఅవుట్ల అనుమతులను రద్దు చేయడంతో పాటు, వెంచర్ నిర్వాహకులు కాలువ మార్గాన్ని పునరుద్ధరించేంత వరకు మార్ట్గేజ్ ప్లాట్లను విడుదల చేయరాదని ఆదేశాలు జారీ చేశారు.
పెర్కిట్ గ్రామంలో లేఅవుట్లను నిలిపివేత
పెర్కిట్ గ్రామంలోని 377, 378, 385, 386, 388, 390, 391, 392, 393, 394 సర్వే నంబర్లలో అభివృద్ధి చేసిన లేఅవుట్లు నిజాంసాగర్ కాలువ D-82/21 పై 40 అడుగుల రహదారి నిర్మాణానికి అనుమతి లేకుండా అభివృద్ధి చేయడం నిబంధనలకు విరుద్ధమని EE, ఇరిగేషన్ డివిజన్ నివేదిక పేర్కొంది. దీని ఆధారంగా, ఆ లేఅవుట్లకు మునుపటి అనుమతులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కఠిన చర్యలు తప్పవు!
లేఅవుట్ల అభివృద్ధిలో నిబంధనలను ఉల్లంఘిస్తే, కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా అధికారులు హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
లేఅవుట్ల రద్దు సరే… నాన్-లేఅవుట్ల పరిస్థితి ఏమిటి?
అధికారుల చర్యలతో లేఅవుట్లపై స్పష్టమైన చర్యలు కనిపిస్తున్నప్పటికీ, అనుమతులు లేకుండా అభివృద్ధి చేసిన నాన్-లేఅవుట్లపై ఎలాంటి చర్యలు ఉంటాయనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ప్రభుత్వం లేఅవుట్లను రద్దు చేసి, రిజిస్ట్రేషన్‌లను నిలిపివేసినట్లే, నిబంధనలను ఉల్లంఘించి అభివృద్ధి చేసిన నాన్-లేఅవుట్ వెంచర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.జిల్లాలోని మండల కేంద్రాల్లోని నిజాంసాగర్ కాలువ ఆనవాళ్లు లేకుండా నాన్-లేఅవుట్లు వెలసి, అసైన్మెంట్ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారన్న పిర్యాదులు వస్తున్నాయి. వీటిపై జిల్లా అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.











