నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4
రెండు రెవెన్యూ బృందాల నియామకం
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సదస్సులు
అందుబాటులో హెల్ప్ డెస్క్, వెరిఫికేషన్ బృందాలు
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వెల్లడి
ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జిల్లాలోని మెండోరా మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని అన్నారు. ఈ బృందాలు షెడ్యూల్ ను అనుసరిస్తూ ఆయా గ్రామాలలో ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై రైతులు, ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ప్రతి రోజు ఒక్కో బృందం ఒక గ్రామం చొప్పున రోజుకు రెండు గ్రామాలలో సదస్సులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని వివరించారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి సహకారం అందించేందుకు వీలుగా హెల్ప్ డెస్క్ బృందాలను, దరఖాస్తులను వెంటదివెంట పరిశీలన జరిపేలా వెరిఫికేషన్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 5న చాకిర్యాల, కొడిచెర్ల గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు జరుగుతాయని వివరించారు. 6వ తేదీన బుస్సాపూర్, మెండోరా గ్రామాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో, 7వ తేదీన వెల్గటూర్ జడ్పీ హైస్కూల్, సావెల్ గ్రామ పంచాయతీలలో, 8న దూదిగాం సీఎస్ఐ స్కూల్, సోన్ పేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని అన్నారు. భూ సమస్యలు కలిగిన రైతులు, ప్రజలు ఈ సదస్సులను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.